ఒంగోలు, ఫిబ్రవరి 9 (న్యూస్‌టైమ్): రాజ్యాంగబద్ధంగా జరిగే ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ అన్నారు. రెండో విడత ఎన్నికలు జరిగే మండలాలకు చెందిన స్టేజ్-2 సిబ్బందికి మంగళవారం కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలింగ్ రోజు ఎన్నికల ప్రక్రియ మొత్తం సజావుగా జరిగేలా చూడటంలో స్టేజ్-2 అధికారులది కీలక పాత్ర అని కలెక్టర్ చెప్పారు. ఓటు వేయడానికి వచ్చే వారికి పోలింగు కేంద్రంలో అవసరమైన ఏర్పాట్లు సమకూర్చడంలోనూ వీరిదే బాధ్యత అని తెలిపారు. కేటాయించిన గ్రామాలకు ఒకరోజు ముందుగానే చేరుకుని స్థానిక పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ చెప్పారు. అత్యంత సమస్యాత్మక గ్రామాలలో విధులు నిర్వహిస్తున్న మైక్రో అబ్జర్వర్లకు ఒక వీడియో గ్రాఫర్‌ను కేటాయించాలని రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ సూచించారు. పోలింగ్‌కు ముందు రోజే చేసుకోవలసిన ఏర్పాట్లు, ఎన్నికల రోజు నిర్వహించాల్సిన విధులపై ఈ సందర్భంగా కలెక్టర్ అవగాహన కలిగించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) బాపిరెడ్డి, డి.పి.ఓ నారాయణ రెడ్డి, బి.సి కార్పొరేషన్ ఈ.డి వెంకటేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గ్లోరియా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమానికి రెండో విడత ఎన్నికలు జరిగే మండలాలకు చెందిన తహసీల్దార్లు, ఎంపీడీవోలు, జోనల్ అధికారులు, ప్రత్యేక అధికారులు హాజరయ్యారు.