amr03

ఏపీలో బీజేపీ రథయాత్రకు బ్రేక్‌లు

అమరావతి, జనవరి 26 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలు, హిందూ దేవుళ్ల విగ్రహాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆలయాలను పరిరక్షించాలంటూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రథయాత్రకు పూనుకున్న విషయం విదితమే. జనసేన పార్టీ మద్దతుతో రథయాత్ర చేస్తామని ప్రకటించారు. ఫిబ్రవరి 4వ తేదీన కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకు రథయాత్ర చేపట్టాలని నేతలు భావించారు. అయితే సడన్‌గా బీజేపీ రథయాత్రకు బ్రేక్ పడింది. రథయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీజేపీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. స్థానిక ఎన్నికల అనంతరం ఈ రథయాత్రకు సంబంధించి తేదీలను వెల్లడిస్తామని చెప్పారు.

కాగా, గత కొన్ని రోజులుగా ఏపీలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై రాజకీయ దుమారం కూడా చెలరేగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలు మతం రంగు పులుముకుంటున్నాయి. ఈ తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. మరోవైపు విగ్రహాల ధ్వంసంపై కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ నుంచి సిట్‌కు బదిలి చేసింది. ఈ క్రమంలోనే బీజేపీ రథయాత్ర చేపట్టాలని నిర్ణయించింది. అయితే స్థానిక ఎన్నికల వల్ల రథయాత్రను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Latest News