The Prime Minister, Shri Narendra Modi addressing at the dedication to the nation and foundation laying of key projects of the Oil and Gas sector in Tamil Nadu, via video conferencing, in New Delhi on February 17, 2021.

తమిళనాడులో కీలక ప్రాజెక్టులు జాతికి అంకితం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (న్యూస్‌టైమ్): తమిళనాడులో చమురు, గ్యాస్ రంగానికి చెందిన కీలక ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా శంకుస్థాపనలు చేసి, దేశానికి అంకితం చేశారు. మనాలిలోని చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో రామనాథపురం-తూత్తుకుడి సహజవాయువు పైప్‌లైన్, గ్యాసోలిన్ డి-సల్ఫ్యూరైజేషన్ యూనిట్‌ను ప్రధానమంత్రి దేశానికి అంకితం చేశారు. నాగపట్నం వద్ద కావేరి బేసిన్ రిఫైనరీకి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్, తమిళనాడు ముఖ్యమంత్రి, కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి పాల్గొన్నారు.

2019-20లో డిమాండ్‌ను తీర్చడానికి భారతదేశం 85 శాతం చమురును, 53 శాతం గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటున్న అంశాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. మనలాంటి వైవిధ్యమైన, ప్రతిభావంతులైన దేశం ఇంధన దిగుమతిపై ఆధారపడగలదా? అని ఆయన ప్రశ్నించారు. మనం చాలా ముందుగానే ఈ విషయాలపై దృష్టి కేంద్రీకరించినట్లయితే, మన మధ్యతరగతి ప్రజలపై భారం పది ఉండేది కాదని ఆయన నొక్కి చెప్పారు. ఇప్పుడు, స్వచ్ఛమైన, హరిత ఇంధన వనరుల వైపు దృష్టి సారించి, ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడం, మన సామూహిక కర్తవ్యం. ‘‘మన ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల ఆందోళనల పట్ల సున్నితంగా వ్యవహరిస్తోంది.’’ అని ఆయన ఉద్ఘాటించారు.

‘‘దీనిని సాధించడానికి భారతదేశం ఇప్పుడు రైతులకు, వినియోగదారులకు సహాయపడటానికి ఇథనాల్‌పై దృష్టి సారిస్తోంది. ఈ రంగంలో ముందు వరుసలో నిలవడానికి, సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత పెంచడంపై కూడా దృష్టి పెట్టడం జరుగుతోంది. ప్రజా రవాణాను ప్రోత్సహించడంతో పాటు, మధ్యతరగతి గృహాల్లో భారీగా పొదుపును ప్రోత్సహించడానికి, ఎల్‌ఈడీ బల్బుల వంటి ప్రత్యామ్నాయ వనరులను స్వీకరిస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను తీర్చడానికి భారతదేశం పనిచేస్తుండగా, ఇది మన ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు, దిగుమతి వనరులను వైవిధ్యపరుస్తుందని, ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ఇందుకోసం, సామర్ద్యాన్ని పెంపొందించడం జరుగుతోంది. 2019-20లో శుద్ధి సామర్థ్యంలో భారతదేశం ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. సుమారు 65.2 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.’’ అని ప్రధానమంత్రి చెప్పారు.

27 దేశాలలో భారతీయ చమురు, గ్యాస్ కంపెనీల ఉనికి గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ విదేశాలలో సుమారు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు ఉన్నాయన్నారు. ‘వన్ నేషన్ వన్ గ్యాస్ గ్రిడ్’ గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ ఐదేళ్లలో చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏడున్నర లక్షల కోట్లు ఖర్చు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. 407 జిల్లాల్లో ఈ పధకాన్ని, అమలుచేయడం ద్వారా నగర గ్యాస్ పంపిణీ వ్యవస్థల విస్తరణకు బలమైన ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వివరించారు. పహల్, ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన వంటి వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే పథకాలు ప్రతి భారతీయ కుటుంబానికీ ఈ గ్యాస్‌ను అందుబాటులోకి తీసుకురావడంలో సహాయపడుతున్నాయని ప్రధానమంత్రి తెలియజేశారు. తమిళనాడుకు చెందిన 95 శాతం మంది వినియోగదారులు పహల్ పథకంలో చేరారని, క్రియాశీల వినియోగదారుల్లో 90 శాతానికి పైగా వినియోగదారులు ప్రత్యక్ష సబ్సిడీ బదిలీని పొందుతున్నారన్నారు.

ఉజ్జ్వల పధకం కింద, తమిళనాడులో 32 లక్షలకు పైగా బి.పి.ఎల్. గృహాలకు కొత్త కనెక్షన్లు జారీ ఇవ్వడం జరిగిందని, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద 31.6 లక్షలకు పైగా కుటుంబాలు ఉచిత రీఫిల్స్‌తో లబ్ధి పొందుతున్నాయని ప్రధానమంత్రి తెలియజేశారు. ఈ రోజు ప్రారంభమైన రామనాథపురం-టుటికోరిన్ ఇండియన్ ఆయిల్‌కు చెందిన 143 కిలోమీటర్ల పొడవైన సహజవాయువు పైపులైన్ ఒ.ఎన్.జి.సి. గ్యాస్ క్షేత్రాల నుండి వాయువును మోనటైజ్ చేస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. 4,500 కోట్ల రూపాయల వ్యయంతో అభివృధి చేస్తున్న ఒక పెద్ద సహజవాయువు పైప్‌లైన్ ప్రాజెక్టులో ఇది ఒక భాగమని, ఇది, ఎన్నూర్, తిరువల్లూరు, బెంగళూరు, పాండిచేరి, నాగపట్నం, మధురై, టుటికోరిన్ ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.

‘‘ఈ గ్యాస్ పైప్‌-లైన్ ప్రాజెక్టులు తమిళనాడులోని 10 జిల్లాల్లో 5,000 కోట్ల రూపాయల పెట్టుబడితో అభివృద్ధి చేస్తున్న సిటీ గ్యాస్ ప్రాజెక్టుల అభివృద్ధికి కూడా దోహదపడతాయి. ఒ.ఎన్.‌జి.సి. క్షేత్రం నుండి వచ్చే వాయువు ఇప్పుడు టుటికోరిన్‌లోని సదరన్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు పంపిణీ చేయబడుతుంది. ఎరువుల తయారీ కోసం ఎస్.పి.ఐ.సి.కి తక్కువ ఖర్చుతో, ఈ పైప్-‌లైన్ ద్వారా, సహజ వాయువును ఫీడ్‌-స్టాక్‌‌గా సరఫరా చేయడం జరుగుతుంది. నిల్వ అవసరాలు లేకుండా ఫీడ్-‌స్టాక్ ఇప్పుడు నిరంతరం అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ఏటా 70 కోట్ల రూపాయల నుండి 95 కోట్ల రూపాయల వరకు ఉత్పత్తి వ్యయం ఆదా అవుతుంది. ఇది ఎరువుల ఉత్పత్తికి అయ్యే తుది ఖర్చును కూడా తగ్గిస్తుంది.’’ అని ప్రధానమంత్రి చెప్పారు.

భారత్ మొత్తం ఇంధన రంగంలో గ్యాస్ వాటాను ప్రస్తుతం ఉన్న 6.3 శాతం నుంచి 15 శాతానికి పెంచే దేశ ప్రణాళికను ప్రధానమంత్రి ప్రకటించారు. స్థానిక నగరాలకు సమకూరే ప్రయోజనాల గురించి ప్రధానమంత్రి వివరిస్తూ నాగపట్నం వద్ద సి.పి.సిఎల్ కొత్త శుద్ధి కర్మాగారం పదార్థాలు, సేవల వినియోగంలో 80 శాతం దేశీయ సోర్సింగుకు అవకాశం కల్పించనుందని తెలిపారు. రవాణా సౌకర్యాలు, చిన్న, చిన్న పెట్రో కెమికల్ పరిశ్రమలతో పాటు, ఈ ప్రాంతంలోని అనుబంధ, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి, ఈ చమురు శుద్ధి కర్మాగారం ఎంతగానో దోహదపడుతుందన్నారు.

‘‘పునరుత్పాదక వనరుల నుండి ఇంధన వాటాను పెంపొందించడంపై భారతదేశం ఎక్కువగా దృష్టి పెట్టింది. 2030 నాటికి మొత్తం ఇంధన ఉత్పత్తిలో 40 శాతం హరిత ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి అవుతుంది.’’ అని ప్రధానమంత్రి చెప్పారు. ఈ రోజు ప్రారంభించిన మనాలిలోని రిఫైనరీలో సి.పి.సి.ఎల్. కొత్త గ్యాసోలిన్ డి-సల్ఫరైజేషన్ యూనిట్, హరిత భవిష్యత్తు కోసం మరొక ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. గత ఆరేళ్ళలో తమిళనాడులో అమలు చేయడానికి 50,000 కోట్ల రూపాయల విలువైన చమురు, గ్యాస్ ప్రాజెక్టులు ఆమోదించినట్లు చెప్పారు. అదే కాలంలో 2014కి ముందు మంజూరైన 9100 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులు పూర్తయ్యాయని, వీటికి అదనంగా, 4,300 కోట్లరూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టుల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని, తమిళనాడులోని అన్ని ప్రాజెక్టులు భారతదేశం స్థిరమైన వృద్ధికి, స్థిరమైన విధానాలు, కార్యక్రమాల ఉమ్మడి ప్రయత్నాల ఫలితమని పేర్కొంటూ మోడీ తన ప్రసంగాన్ని ముగించారు.

Latest News