tpt02

ఘనంగా కోదండరాముడి పేట ఉత్సవం

తిరుపతి, ఫిబ్రవరి 28 (న్యూస్‌టైమ్): తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం ఆది‌వారం ఘనంగా జరిగింది. మాఘపౌర్ణమి సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లడం ఆనవాయితీ. ఉదయం 5 గంటలకు ఆలయం నుండి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఊరేగింపు బయల్దేరింది. ఉదయం 10 గంటలకు తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు చేరుకుంది.

అక్కడ ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 4.00 నుంచి 5.00 గంటల వరకు ఊంజల్‌సేవ చేపడతారు. సాయంత్రం 5.00 గంటలకు గ్రామోత్స‌వం నిర్వ‌హించి, ఆలయానికి చేరుకుంటారు. ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం జరిగిన స్వామివారి ఊరేగింపులో టిటిడి హిందూధర్మ ప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి పార్వ‌తి, ఏఈవో శ్రీ దుర్గ‌రాజు, సూపరింటెండెంట్‌ శ్రీ ర‌మేష్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Latest News